పిండ బదిలీ తర్వాత సానుకూల సంకేతాలు: విజయాన్ని సూచించే ప్రారంభ లక్షణాలు

Last updated: March 13, 2026

అవలోకనం

పిండం బదిలీ (Embryo Transfer) తర్వాత వచ్చే ఆ రెండు వారాల నిరీక్షణ సమయం, ఐవీఎఫ్ ప్రయాణంలో అత్యంత ఉత్కంఠభరితమైన మరియు భావోద్వేగంతో కూడిన దశ. గర్భధారణను పక్కాగా నిర్ధారించడానికి రక్త పరీక్షే సరైన మార్గమైనప్పటికీ, మన శరీరంలో కనిపించే కొన్ని చిన్న చిన్న మార్పులు పిండం గర్భాశయ గోడకు విజయవంతంగా అతుక్కున్నట్లు (ఇంప్లాంటేషన్) కొన్ని హింట్స్ ఇస్తాయి. తేలికపాటి రక్తస్రావం, కడుపులో తిమ్మిర్లు, నీరసం లేదా రొమ్ముల్లో సున్నితత్వం వంటి లక్షణాలు ఇంప్లాంటేషన్‌ను సూచించవచ్చు. ఈ వ్యాసంలో అసలు ట్రాన్స్‌ఫర్ తర్వాత శరీరం లోపల ఏం జరుగుతుంది, ఆ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయి మరియు వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

పరిచయం

ఐవీఎఫ్ (IVF) ప్రక్రియలో అన్నిటికంటే కీలకమైన ఘట్టం పిండ బదిలీ. ల్యాబ్‌లో తయారు చేసిన పిండాన్ని ఎంతో జాగ్రత్తగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టి, అది అక్కడ స్థిరపడాలని దంపతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ పిండం గర్భాశయానికి అతుక్కుందా (Implantation) లేదా అని తెలుసుకోవడానికి వేచి చూసే రోజులు ఎంతో టెన్షన్‌గా ఉంటాయి. ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు; ఒక్కో మహిళ శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. అయినప్పటికీ, ఇంప్లాంటేషన్ సక్సెస్ అయిందని చెప్పడానికి కొన్ని సానుకూల సంకేతాలు మనకు కనిపిస్తాయి.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, మనం ఇప్పుడు చర్చించబోయే ఏ లక్షణం కూడా 100% గ్యారెంటీ కాదు. కేవలం రక్త పరీక్ష (Beta hCG) లేదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా మాత్రమే గర్భధారణను మనం పక్కాగా నిర్ధారించగలము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, సక్సెస్ అయిందని సూచించే ఆ ప్రారంభ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పిండ బదిలీ తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది?

పిండ బదిలీ జరిగిన వెంటనే, మీ శరీరంలో ఇంప్లాంటేషన్‌కు మద్దతు ఇచ్చే ఒక ప్రత్యేక ప్రక్రియ మొదలవుతుంది. బదిలీ చేసిన పిండం గర్భాశయంలో ప్రయాణించి, చివరకు గర్భాశయ పొరను (Uterine lining) చేరుకుని అక్కడ స్థిరపడుతుంది. పిండం అలా అతుక్కున్న వెంటనే, దాని ఎదుగుదలకు మద్దతుగా శరీరం గర్భధారణ హార్మోన్లను విడుదల చేయడం ప్రారంభిస్తుంది.

అసలు ఇది ఎప్పుడు జరుగుతుంది?

  • బదిలీ నుండి ఇంప్లాంటేషన్: సాధారణంగా ట్రాన్స్‌ఫర్ అయిన 6 నుండి 10 రోజుల మధ్యలో పిండం గర్భాశయానికి అతుక్కుంటుంది.
  • hCG ఉత్పత్తి: ఇంప్లాంటేషన్ మొదలైనప్పుడే శరీరంలో hCG హార్మోన్ విడుదలవుతుంది. దీని ప్రభావం వల్లే మనకు గర్భధారణ లక్షణాలు తెలియడం మొదలవుతుంది.

ఆ తర్వాత అసలు ప్రక్రియ వేగవంతం అవుతుంది. పిండం అతుక్కోవడమే మొదటి అడుగు. ఆపై hCG స్థాయిలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఎస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్లు గర్భానికి బలమైన పునాదిని వేస్తాయి. ఈ హార్మోన్ల మార్పులన్నీ కలిపి మనకు ప్రారంభ లక్షణాల రూపంలో కనిపిస్తాయి.

పిండ బదిలీ తర్వాత కనిపించే సానుకూల సంకేతాలు

1. స్వల్ప స్పాటింగ్ లేదా ఇంప్లాంటేషన్ రక్తస్రావం

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ పూర్తయిన కొన్ని రోజులకు మీ ప్యాంటీపై చిన్న రక్తపు చుక్కలు కనిపిస్తే అస్సలు కంగారు పడకండి. నిజానికి ఇది మీరు కోరుకున్న శుభవార్తకు తొలి సంకేతం కావచ్చు! పిండం గర్భాశయ పొరలోకి చొచ్చుకుపోయి అక్కడ స్థిరపడే క్రమంలో (Implantation), గర్భాశయ గోడలోని కొన్ని చిన్న రక్తనాళాలు చిట్లి స్వల్పంగా రక్తస్రావం జరుగుతుంది. దీనినే మనం 'ఇంప్లాంటేషన్ బ్లీడింగ్' అని పిలుస్తాము. ఇది పిండం విజయవంతంగా అతుక్కుందని చెప్పడానికి ఒక సానుకూల గుర్తు. ఇంప్లాంటేషన్ రక్తస్రావం గురించి మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు:

  • ఇది సాధారణంగా భ్రూణ మార్పిడి జరిగిన 6 నుండి 12 రోజుల మధ్యలో కనిపిస్తుంది. అంటే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి కొన్ని రోజుల ముందు ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది.
  • ఇది మీ పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తస్రావంలా అస్సలు ఉండదు. చాలా తక్కువగా, కేవలం గులాబీ రంగులో (Pinkish) లేదా ముదురు గోధుమ రంగులో (Brownish discharge) కనిపిస్తుంది. రక్తపు చుక్కలు కేవలం తుడిచుకున్నప్పుడు మాత్రమే కనిపించవచ్చు.
  • ఈ రక్తస్రావం పీరియడ్స్‌లా వారం రోజులు ఉండదు. ఇది కేవలం కొన్ని గంటల పాటు లేదా గరిష్టంగా ఒకటి నుండి రెండు రోజులు మాత్రమే ఉండి వాటంతట అదే ఆగిపోతుంది.

2. కడుపులో స్వల్పంగా నొక్కినట్లు లేదా సూదిపోట్లు అనిపించడం

పిండం బదిలీ జరిగిన తర్వాత, పొత్తికడుపు కింది భాగంలో చిన్నగా నొక్కినట్లు లేదా ఎవరో సూదితో మెల్లగా గుచ్చినట్లు అనిపించడం చాలా సహజం. దీని గురించి మీరు అస్సలు కంగారు పడక్కర్లేదు. సాధారణంగా మనకు నెలసరి (పీరియడ్స్) సమయంలో వచ్చే విపరీతమైన నొప్పిలా ఇది అస్సలు ఉండదు. ఇది చాలా తేలికపాటి నొప్పి, అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటుంది. గర్భాశయ పొర కొంచెం వెడల్పు అవ్వడం వల్ల మరియు మీ శరీరంలో జరుగుతున్న హార్మోన్ల మార్పుల వల్ల ఇలా అనిపిస్తుంది. ఈ చిన్నపాటి అసౌకర్యం మీరు రోజూ చేసుకునే పనులకు ఎలాంటి అడ్డంకి కలిగించదు.

3. స్తనాల్లో సున్నితత్వం లేదా ఉబ్బినట్లు అనిపించడం

భ్రూణ మార్పిడి తర్వాత శరీరంలో హార్మోన్ల స్థాయిలు (ముఖ్యంగా hCG మరియు ప్రొజెస్టెరాన్) వేగంగా పెరుగుతాయి. దీనివల్ల మీ స్తనాలు (రొమ్ములు) కొంచెం ఉబ్బినట్లు, బరువుగా లేదా మెత్తగా మారినట్లు అనిపించవచ్చు. వాటిని తాకినప్పుడు కొంచెం నొప్పిగా లేదా సున్నితంగా అనిపిస్తుంది. చాలా మంది మహిళలకు నెలసరి వచ్చే ముందు కూడా ఇలాగే అనిపిస్తుంది, కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ మార్పు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పిండం విజయవంతంగా అతుక్కుందని చెప్పడానికి ఒక మంచి గుర్తు.

4. విపరీతమైన అలసట మరియు నీరసం

ఏ పనీ చేయకపోయినా మీకు చాలా నీరసంగా, ఎప్పుడూ నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుందా? అయితే ఇది కూడా ఒక పాజిటివ్ సంకేతమే! శరీరంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల మన శరీరం త్వరగా అలసిపోతుంది. ఇది మీ నాడీ వ్యవస్థపై ఒక రకమైన నిద్రమత్తును కలిగిస్తుంది. మీ శరీరం లోపల పిండం ఎదుగుదలకు చాలా శక్తి ఖర్చవుతుంది కాబట్టి, మీకు ఇలాంటి అలసట రావడం చాలా సహజం.

5. కడుపు ఉబ్బరం మరియు జీర్ణ సమస్యలు

హార్మోన్ల మార్పుల ప్రభావం మన జీర్ణక్రియపై కూడా ఉంటుంది. దీనివల్ల మన పేగుల కదలిక కొంచెం నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బినట్లు (Bloating) అనిపించడం, గ్యాస్ పట్టేయడం లేదా మలబద్ధకం వంటి ఇబ్బందులు రావచ్చు. కడుపు నిండుగా ఉన్నట్లు, టైట్‌గా ఉన్నట్లు అనిపించడం కూడా ఇంప్లాంటేషన్ జరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం.

6. శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడం

పిండం గర్భాశయానికి అతుక్కున్న తర్వాత, శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ నిరంతరం విడుదలవుతూనే ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల మీ శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు జ్వరం వచ్చినట్లు అనిపించదు కానీ, ఒళ్లు కొంచెం వేడిగా ఉన్నట్లు (Basal Body Temperature) అనిపిస్తుంది. మీరు ప్రతిరోజూ థర్మామీటర్‌తో చెక్ చేసుకుంటే ఈ చిన్న మార్పును గమనించవచ్చు.

7. పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ (చివరిగా వచ్చే సంకేతం)

పైన చెప్పిన లక్షణాలన్నీ ఒక ఎత్తు అయితే, గర్భాన్ని ఖచ్చితంగా నిర్ధారించేది మాత్రం ప్రెగ్నెన్సీ టెస్టే! భ్రూణ మార్పిడి జరిగిన 9 నుండి 14 రోజుల తర్వాత ఇంట్లో ఉండే ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా లేదా హాస్పిటల్‌లో బ్లడ్ టెస్ట్ (Beta hCG) ద్వారా అసలు విషయం తెలుస్తుంది. ఈ లోపు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే, మీ శరీరం శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోందని అర్థం.

పిండ బదిలీ తర్వాత సానుకూల లక్షణాలు ఎంత త్వరగా కనిపిస్తాయి?

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి భార్యాభర్తలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూడటం చాలా మామూలు విషయం. సామాన్యంగా, పిండం గర్భాశయానికి అతుక్కున్న 6 నుండి 12 రోజుల మధ్య మన శరీరంలో కొన్ని మార్పులు తెలియడం మొదలవుతాయి. శరీరంలో పెరిగే ప్రొజెస్టెరాన్ మరియు హెచ్‌సీజీ (hCG) అనే హార్మోన్ల వల్లే ఈ లక్షణాలు వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ అనుభవం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి లక్షణాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి, మరికొందరికి అసలు ఏమీ అనిపించకపోవచ్చు. ఈ రెండు కూడా మామూలు విషయాలే, కాబట్టి లక్షణాలు కనిపించలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు.

సాధారణంగా ఐవీఎఫ్ (IVF) సక్సెస్ అయ్యే ప్రయాణం ఇలా ఉండవచ్చు:

  • 1 నుండి 3 రోజులు: ఈ సమయంలో బయటకు ఎలాంటి మార్పులు తెలియవు. ఇది ఒక 'నిశ్శబ్ద దశ' లాంటిది. శరీరం లోపల పిండం స్థిరపడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
  • 4 నుండి 6 రోజులు: కడుపులో కొంచెం నొక్కినట్లు (Cramps) అనిపించడం లేదా చిన్న చిన్న రక్తపు చుక్కలు (Spotting) కనిపించే అవకాశం ఉంటుంది.
  • 7 నుండి 10 రోజులు: కడుపు ఉబ్బరంగా అనిపించడం, రొమ్ముల్లో నొప్పి, మరియు మూడ్ మారుతూ ఉండటం (చిరాకు లేదా ఆందోళన) వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఒకవేళ మీకు ఎటువంటి సానుకూల సంకేతాలు కనిపించకపోతే ఏమవుతుంది?

పిండ బదిలీ (Embryo Transfer) తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు లేదా పైన చెప్పుకున్న లక్షణాలు ఏమీ కనిపించకపోతే ఆందోళన చెందడం చాలా సహజం. "నాకు స్పాటింగ్ అవ్వలేదు, కడుపులో నొప్పి లేదు, ఇక రిజల్ట్ నెగటివ్ వస్తుందేమో" అని చాలా మంది మహిళలు భయపడుతుంటారు. కానీ, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే - లక్షణాలు ఏమీ లేకపోయినా మీ ఐవీఎఫ్ (IVF) ప్రయాణం విజయవంతం కావచ్చు!

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత రొమ్ముల్లో నొప్పి, రక్తపు చుక్కలు కనిపించడం లేదా కడుపులో తిమ్మిర్లు వంటి లక్షణాలు మీకు తెలిసినా, తెలియకపోయినా అస్సలు ఆందోళన చెందకండి. ఎందుకంటే ఈ లక్షణాలు అనేవి మీ శరీరంలోని హార్మోన్లు, బదిలీ చేసిన పిండం రకం మరియు మీ శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా మారుతుంటాయి. ఒక్కోసారి ఆ రెండు వారాల నిరీక్షణలో ఉండే విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా మనకు ఈ లక్షణాలు ఏమీ తెలియనట్లు అనిపించవచ్చు.

నిజానికి మీరు గర్భం దాల్చారో లేదో అని ఖచ్చితంగా నిర్ధారించే ఏకైక మార్గం మెడికల్ టెస్ట్ మాత్రమే. దీనికోసం రక్తంలో ఉండే hCG స్థాయిలను కొలిచే రక్త పరీక్ష చేయించుకోవాలి. సాధారణంగా పిండ బదిలీ జరిగిన 9 నుండి 14 రోజుల తర్వాత ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ నిరీక్షణ సమయంలో మీరు చేయాల్సిందల్లా, ఓపికగా ఉండటం, టెన్షన్ తగ్గించుకోవడం మరియు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం.

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత సానుకూల లక్షణాలను గమనించడానికి సూచనలు

1. లక్షణాల డైరీని ఉపయోగించండి

ప్రతి రోజు మీకు అనిపించే మార్పులను అలసట, కడుపు మెలికలు, స్పాటింగ్, ఛాతిలో నొప్పి వంటి వాటిని డైరీలో నమోదు చేసుకోండి. ప్రతి చిన్న అనుభూతిని అతిగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. కానీ కొంత కాలం గమనించడం ద్వారా సూక్ష్మ మార్పులను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.

2. చాలా తొందరగా పరీక్ష చేయవద్దు

చాలా ముందుగా చేసిన పరీక్షలు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 - 14 రోజుల వరకు వేచి ఉండి పరీక్ష చేయించుకుంటే ఫలితాలు నమ్మదగినవిగా ఉంటాయి.

3. భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి

ఈ సమయం మానసికంగా కష్టంగా అనిపించవచ్చు. ప్రశాంతమైన దినచర్యలు, సరైన నిద్ర, మరియు మనసుకు నెమ్మదినిచ్చే కార్యకలాపాల ద్వారా మీ భావోద్వేగ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ శరీరంపై నమ్మకం ఉంచండి.

సానుకూల లక్షణాల వల్ల కలిగే భావోద్వేగాలు

శరీరంలో ఈ మార్పులు కనిపించినప్పుడు మనసులో ఎన్నో ఆశలు, ఇంకెంతో ఉత్కంఠ కలగడం చాలా సహజం. అయితే, ఈ చిన్న చిన్న గుర్తులు కనిపించినంత మాత్రాన గర్భం దాల్చినట్లు మనం ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. ఈ సమయంలో మనసును అదుపులో ఉంచుకోవడం, నిబ్బరంగా ఉండటం చాలా అవసరం. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే, మీ శరీరం అంత బాగా సహకరిస్తుంది. కాబట్టి, మనసును వేరే వ్యాపకాలపై మళ్లించండి. నీళ్లు బాగా తాగుతూ, అనవసరమైన టెన్షన్ తీసుకోకుండా, మీ డాక్టర్ ఇచ్చే సలహాలను పాటిస్తూ ఉండండి.

చివరగా ఒక మాట

మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు అన్నీ పిండం అతుక్కుంది అనడానికి చిన్న 'హింట్స్' మాత్రమే, అవి పక్కా రిజల్ట్స్ కావు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది - ఒకరికి అన్ని లక్షణాలు కనిపిస్తే, మరొకరికి అస్సలు ఏమీ తెలియకపోవచ్చు. కాబట్టి లక్షణాలను బట్టి కంగారు పడకండి. రక్త పరీక్షలో (Beta hCG) హార్మోన్ స్థాయిలను చూసినప్పుడే మనకు అసలైన శుభవార్త తెలుస్తుంది.

ఈ రెండు వారాల నిరీక్షణ అస్సలు సులభం కాదు, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఈ ప్రయాణంలో మీపై మీరు నమ్మకం ఉంచండి. మీ మనసును సానుకూల ఆలోచనలతో నింపండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు పడే ప్రతి కష్టం, పడే ప్రతి తపన మిమ్మల్ని త్వరలోనే మీ పండంటి బిడ్డకు చేరువ చేస్తుందని గట్టిగా నమ్మండి.

తరచూ అడిగే ప్రశ్నలు

భ్రూణ మార్పిడి తర్వాత కనిపించే మొదటి సానుకూల సంకేతం ఏమిటి?

IVF తర్వాత స్పాటింగ్ ఎప్పుడూ మంచి సంకేతమేనా?

ఈ లక్షణాలు గర్భధారణ వల్ల కాకుండా IVF మందుల వల్ల రావచ్చా?

ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎంత రోజులకి పాజిటివ్ టెస్ట్ రావచ్చు?

జంట పిల్లలు (ట్విన్స్) ఉన్నప్పుడు ప్రారంభ లక్షణాలు ఎక్కువగా ఉంటాయా?

భ్రూణ మార్పిడి తర్వాత ఎలాంటి లక్షణాలు లేకపోవడం కూడా సాధారణమేనా?

ఒత్తిడి ప్రారంభ గర్భధారణ లక్షణాలపై ప్రభావం చూపుతుందా?

లక్షణాలపై నమ్మకం పెట్టుకోవాలా లేక రక్త పరీక్ష ఫలితాల కోసం వేచి ఉండాలా?

Disclaimer: The information provided here serves as a general guide and does not constitute medical advice. We strongly advise consulting a certified fertility expert for professional assessment and personalized treatment recommendations.
పిండ బదిలీ తర్వాత సానుకూల సంకేతాలు: విజయాన్ని సూచించే ప్రారంభ లక్షణాలు
© 2026 Indira IVF Hospital Limited. All Rights Reserved. T&C Apply | Privacy Policy| *Disclaimer